Thursday 16 July 2020

బాల్యదశ

వ్యక్తి జీవితంలో బాల్యదశ చాలా కీలకమైన దశ. ఈ దశలో వారు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతాయి. ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మనో వైజ్ఞానిక వేత్తలు వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించారు. అందుకే బాల్యం వ్యక్తి జీవితానికి ఒక పునాదిగా చెప్పవచ్చు. కనుక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లల బాల్యదశ నిర్మితి, వారి పూర్వ అభ్యసన అనుభవాలపై సరైన అవగాహన ఉండాలి. బాల్యదశ అంటే ఏమిటి? అందరి పిల్లల బాల్యం ఒకేలా వుంటుందా? వేర్వేరుగా వుంటే దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? బాల్యదశను ప్రభావితం చేసే అంశాలేమిటి? పిల్లల పెంపక విధానాలు పిల్లల బాల్యదశ నిర్మితిపై ఏ రకమైన ప్రభావం చూపుతాయి మొదలగు విషయాలు ఉపాధ్యాయులకు కచ్చితంగా తెలిసి వుండాలి. వాటితోపాటు బాలలను ఏ రకంగా అధ్యయనం చేయాలో తెలుసుకోగలిగి వుండాలి.

ఉపాధ్యాయులు తాము పై అంశాలకు చెందిన జ్ఞానాన్ని సముపార్జించుకుని తరగతి గదికి అన్వయించినపుడు, తల్లిదండ్రుల సమావేశాల్లో ప్రతి స్పందించినప్పుడు వారికి మంచి గుర్తింపు రావటమే కాకుండా మంచి ఉపాధ్యాయులుగా రాణించగల్గుతారు. 1.2 యూనిట్ లక్ష్యాలు:

ఈ యూనిట్ అధ్యయనం చేసిన తరువాత, ఛాత్రోపాధ్యాయులు 1) బాల్యదశ భావనను అవగాహన చేసుకుంటారు.

బాల్యదశలో సామ్యాలు, వైవిధ్యాలు అవగాహన చేసుకుంటారు. 3) భారతీయ నేపద్యంలో బహుల బాల్య దశల నిర్మితిపై అవగాహన పొందుతారు.

బాల్యదశ నిర్మితిని ప్రభావితం చేసే అంశాల గూర్చి తెలుసుకుంటారు.

సాంఘికీకరణలో కుటుంబం, పాఠశాలల యొక్క పాత్రను అవగాహన చేసుకుంటారు. పిల్లల పెంపక విధానాల గూర్చి అవగాహన పొందుతారు. 7) పిల్లలను అధ్యయనం చేసే వివిధ పద్దతులకు, ఉపగమాలకు చెందిన అంశాలను అవగాహన చేసుకుంటారు. 1.3 బాల్యదశ నిర్మాణం: (Constructs of childhood)

బాల్యదశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైన దశ. ఈ మధ్య మనం తరచుగా 'పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు' అనే మాటలు వింటున్నాం. అసలు బాల్యాన్ని కోల్పోవటం అంటే ఏమిటి? ఆ వయస్సులో పొందాల్సిన పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు మొదలైనవి కోల్పోవటం అని అంటాం. అలా ఎందుకు జరుగుతుంది? అలా కాకుండా ఏం చెయ్యాలి? అనేవి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశాలు.

అయితే బాలలంటే, బాల్యం అంటే,బాల్యదశ అంటే ఏమిటి? అని ప్రశ్నించినపుడు మనకు అనేక రకాల నిర్వచనాలు కనపడుతుంటాయి. మనో వైజ్ఞానిక వేత్తలు, విద్యావేత్తలు, సాంఘికవేత్తలు, మానవ శాస్త్రజ్ఞులు మొదలైన వారి అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం.


No comments:

Post a Comment